google.com,pub-7984519998562318,DIRECT,f08c47fec0942fa0 కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు...

కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు...

మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన కేసులో ఉపాధ్యాయుడికి 3 ఏళ్ల జైలు శిక్ష...
 
న్యూస్ 21 తెలుగు:మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను వీడియోలతో బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కడప పోక్సో ప్రత్యేక న్యాయస్థానం మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.
పోలీసుల కథనం ప్రకారం, కడప నగరానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వడిషా వెంకటేశ్వర్లు (42) కన్నేశాడు. 2023 ఏప్రిల్ 7న సాయంత్రం బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమెను మాట్లాడాలని పిలిచి, ఎవరూ లేని చోట బలవంతంగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి, వాటిని చూపిస్తూ బాలికను పలుమార్లు బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి తెలియజేయడంతో ఆమె కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ ఎన్.వి. నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం సేకరించిన సాక్ష్యాధారాలతో నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. కేసును విచారించిన కడప పోక్సో ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి ఎం.ఏ. సోమశేఖర్ సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడి నేరం రుజువైనట్లు నిర్ధారించి శిక్ష విధించారు.
ఈ కేసులో ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచిన కోర్టు మానిటరింగ్ సెల్ సహాయ ఉప పరిశీలకుడు నాగేంద్ర, పోలీస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ప్రస్తుత సీఐ వి. చిన్న పెద్దయ్యలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

0 Comments