న్యూస్ 21 తెలుగు: కాకినాడ జిల్లా.తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పరామర్శించారు. చిన్నారి తల్లి జ్ఞానేశ్వరిని ఓదార్చి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌తో కేసు దర్యాప్తు పురోగతిపై సమీక్ష నిర్వహించిన హోంమంత్రి, అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సానా సతీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ చిన్నారి జాహ్నవి అదృశ్యం ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. పాపను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.చిన్నారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వారి వెంటే ఉంటుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు భరోసా ఇచ్చారు. ప్రజలు కూడా వదంతులను నమ్మకుండా అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ
రెండేళ్ల చిన్నారి అదృశ్యమవడం అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొన్నారు. పాప కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న తల్లి జ్ఞానేశ్వరి బాధ వర్ణనాతీతమని అన్నారు.
పాప అదృశ్యమైన విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు ప్రారంభించారని తెలిపారు. సాంకేతిక ఆధారాలతో పాటు గ్రౌండ్ లెవెల్‌లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు.చిన్నారి మిస్సింగ్ కేసులో ప్రభుత్వం ఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజూ ఈ అంశంపై ఉన్నతస్థాయిలో మానిటరింగ్ జరుగుతోందని, పాప ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
అలాగే జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా భరోసాగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
చిన్నారి అదృశ్యం ఘటనకు సంబంధించి సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో అసత్య ప్రచారం జరుగుతోందని హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నారు.
అసత్య కథనాలు, నిరాధార ఆరోపణలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
0 Comments