యుటిఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలోఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు...

ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో తొలి తరం కవుల్లో అన్ని విధాల విలక్షణంగా ప్రసన్నమయ్యే మహనీయ మూర్తి గుర్రం జాషువా అని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు అన్నారు.
గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని
వైయస్సార్ కడప జిల్లా. కడప పట్టణంలో ని యుటిఎఫ్ భవన్ నందు ఆదివారం సాయంత్రం జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమత విద్వేషాలు లేని కళారాజ్యం కోసం కలలుగన్న ఆశావాది, సమతావాది, మానవతావాది జాషువా అని ప్రశంసించారు. గుర్రం జాషువా గారు 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుంటూరు జిల్లా వినుకొండలో వీరయ్య,లింగమాంబ దంపతులకు  జన్మించారని,కులం వల్ల బడిలో వేదిక ఎక్కి పద్యాలు చదివే అవకాశం లేకపోయినా, ప్రాథమికోపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభించి బురదలో పుట్టిన కమలంలా వికసించి తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని పొందడంతో పాటు, శాసనమండలి సభ్యులుగా సైతం పనిచేసి పేరు ప్రసిద్ధులు పొందారన్నారు. తన కవితా నైపుణ్యంతో ప్రజల నాలుకల మీద మాత్రమే కాక హృదయాలలో కూడా సజీవ ముద్ర వేసుకున్నాడన్నారు. సమాజంలో అసమానతలు కలిగినప్పుడు, అంటరానితనం విషం చిమ్మినప్పుడు,దుర్భర దారిద్ర్య పరిస్థితులు ఎదురైనప్పుడు జాషువా కవిత్వం జాగరూకత కల్పిస్తుందన్నారు. రాజకీయ పబ్బం కోసం ప్రజల మధ్య చీలికలు తెచ్చి కుల,మతాల అడ్డు గోడల విషం చిమ్మితే అణగారిన వర్గాల కన్నీటి బిందువులే పిడుగులై అధికార దాహాన్ని కాల్చివేస్తాయని జాషువా ఆనాడే తెలిపారన్నారు. ఎవరు ఏమన్నా తనకు తిరుగులేదని, విశ్వ నరుడుని తానని ప్రకటించుకున్నాడన్నారు. ధర్మానికి పిరికితనము, సత్య వాక్యమునకు చావు లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం జాషువా కే చెల్లుతుందన్నారు. దేశ సంపదను పేదవారికి కాకుండా ఉన్న వాళ్లకే దోచిపెట్టడమేమిటని ప్రశ్నించిన హేతువాది జాషువా బొమ్మల పెళ్లిళ్లకు పెట్టే ఖర్చులో కొంతైనా పేదవారి ఆకలిని తీర్చడానికి ఉపయోగించాలని తెలిపారన్నారు. జాషువా రాసిన స్మశాన వాటిక కావ్యం ద్వారా మానవులంతా ఒకటే అనే తత్వాన్ని బోధించడమే కాకుండా తెలివికి కలిమి లేములతో సంబంధం లేదని, ప్రతిభను కుల మతాల తక్కెడలో తూచరాదని విశ్వసించడన్నారు. జాషువా గారి రచనల సారాంశాన్ని అవగతం చేసుకొని నేటి సమాజాభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ నరసింహారావు జిల్లా కార్యదర్శిలు సివి రమణ, ఏజాస్ అహ్మద్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి నాయకులు సుబ్బారెడ్డి,శివశంకర్, దేవదత్తం, కొండయ్య, గంగన్న, రామ కేశవ, ఎంవిఎస్ రాజు, ప్రకాష్ బాబు,శ్రీనివాసచారి, సుబ్బారావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments