తెలుగుగంగ బ్రహ్మసాగర్ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి...
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి...
న్యూస్ 21 తెలుగు: రాయలసీమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చెరువుల్లో ఒకటైన కడప జిల్లా పోరుమామిళ్ల పెద్ద చెరువు. ఈ చెరువులో సాగునీరు లేక పూర్తిగా అడుగంటిపోవడం తో వేలాది మంది రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పాటు చేపల కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా చెరువులోని నీరంతా వృథాగా పోవడంతో సుమారు 6 వేల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడిందన్నారు. ఈ చెరువుపై ఆధారపడి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నార్లు పోసుకున్న రైతులు ఇప్పుడు పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
చేపల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రైతులకు తీవ్ర నష్టం...
రైతుల ఆరోపణల ప్రకారం, చెరువులో చేపల పెంపకం చేపట్టిన కాంట్రాక్టర్ తన చేపల వేట కోసం చెరువులోని నీటిని బయటకు వదిలేయడంతో సాగునీరు పూర్తిగా తగ్గిపోయిందన్నారు. దీనిపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఒక కాంట్రాక్టర్ లాభపడగా వేలాది మంది రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
సాగు సీజన్ ప్రారంభంలోనే సంక్షోభం...
మే నెల నుంచే రైతులు నార్లు పోసుకుని సాగుకు సిద్ధమయ్యారని, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నాట్లు పూర్తయ్యాయని, మరికొన్ని ప్రాంతాల్లో నారు ముదిరి నాటుకు సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే చెరువులో పెద్ద తూము వద్ద మాత్రమే కొద్దిపాటి నీరు మిగిలి ఉందని, అది కూడా మరో 20 రోజుల వరకు మాత్రమే సరిపోతుందని చెప్పారు. మిగిలిన తూముల పరిధిలోని రైతులకు వారం నుంచి పది రోజులకు మించి నీరు అందే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు...
చెరువు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలు కూడా గణనీయంగా పడిపోయాయని తెలిపారు. సాగునీరు లేకపోవడమే కాకుండా గ్రామాల్లోని బోర్లలో తాగునీరు కూడా అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. పోరుమామిళ్లతో పాటు కాశినాయన, కలసపాడు, బి.కోడూరు మండలాల్లోని చెరువులు కూడా నీరు లేక వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు.
తెలుగుగంగ నీటి విడుదలే పరిష్కారం...
ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగుగంగ బ్రహ్మసాగర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని చాపాటి లక్ష్మి నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. దీనివల్ల సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా కొంతవరకు పరిష్కారమవుతుందని అన్నారు.
అలాగే నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పథకాల పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. ఆ పనులు పూర్తయితే వరికుంట్ల, ఇటుగుళ్లపాడు, గంగనపల్లి, బాలాయపల్లి, తెల్లపాడు, తడుకు తదితర వెనుకబడిన గ్రామాలకు కూడా సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు.
0 Comments