న్యూస్ 21 తెలుగు ఛానల్: గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ” అనే నానుడి ఉన్నా కూడా, కొంతమంది ఉపాధ్యాయులు తమ హోదాకు తగిన విధంగా ప్రవర్తించకపోవడం అత్యంత దురదృష్టకరమని పోరుమామిళ్ల జనసేన మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. వైయస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం లోని కొండుగారిపల్లె ఎస్సీ కాలనీలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న బాలిక పట్ల ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి అనుచితంగా ప్రవర్తించిన ఘటన సమాజం తలదించుకునే స్థాయిలో ఉందన్నారు. తండ్రి స్థానంలో ఉండాల్సిన గురువే కామక్రోధాలకు లోనై చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడం ఉపాధ్యాయ లోకానికి మాయని మచ్చగా మారిందని విమర్శించారు.
చిన్నారి అమాయకత్వాన్ని గుర్తించకుండా, తాగిన మత్తులో బాలికను వేధించిన తీరు అత్యంత హేయమైన నేరమని అన్నారు. ముఖ్యంగా దళిత విద్యార్థినిపై ఈ విధంగా ప్రవర్తించడం మరింత బాధాకరమని, ఇటువంటి ఉపాధ్యాయులను సమాజం బహిష్కరించాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఇలాంటి కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని, ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని ఆయన కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఆడపిల్లల పట్ల గౌరవంగా మెలిగే విధంగా ఉపాధ్యాయ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని, తప్పు చేసిన వారిని ఉపేక్షించకూడదని జనసేన పార్టీ తరఫున స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.
0 Comments