న్యూస్ 21 తెలుగు: నేటి సమాజానికి డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ దార్శనికుడని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి పురస్కరించుకొని యుటిఎఫ్ ఆధ్వర్యంలో బద్వేలులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాదన విజయ కుమార్ మాట్లాడుతూ డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా, ఉప ప్రధాని గా దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ రామ్, అంచెలంచెలుగా ఎదిగి దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించాడన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా సత్యాగ్రహం, క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమం వంటి వాటిలో క్రియాశీలకంగా పాల్గొని, ప్రజల చేత బాబూజీ అని పిలిపించుకుంటూ దేశ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడన్నారు. సామాజిక సమానత్వం అమలు కోసం, కుల రహిత సమాజం కోసం ఎంతగానో కృషి చేశాడన్నారు. స్వాతంత్ర్య అనంతరం భారత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంట్ స్పీకర్ గా ఉప ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసే పార్లమెంటు చరిత్రలో మైలురాయిగా నిలిచాడన్నారు. తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపిస్తూ దళిత బంధుగా కీర్తించబడ్డారన్నారు. కార్మిక చట్టాల్లో మార్పుల కోసం, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అనేక పోరాటాలు చేసి, వాటిని సాధించి పెట్టి పేదల పక్షపాతిగా కీర్తించబడ్డారని తెలిపారు. ఇలాంటి మహనీయుని అడుగుజాడల్లో నేటి యువత నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన తెలిపారు. పాలకులు ఆయన ఆశయాల అమలుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ టి.శివ ప్రసాద్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్, బద్వేల్ మండల అధ్యక్షులు ఎస్.దేవానందం, మండల కార్యదర్శి సి.హెచ్.సాగర్, ఉపాధ్యాయులు జాలా గురయ్య, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు
0 Comments