పరిశ్రమ నుండి వస్తున్న కాలుష్యం కారణంగా చర్మ వ్యాధులు.ఊపిరితిత్తులు.కిడ్నీ సమస్యలను ఎదుర్కొంటున్న స్థానిక ప్రజలు.
నిమ్మకు నీరు ఎత్తినట్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న పరిశ్రమ జిఎం రమేష్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు.
ప్రతి నెలలో పదుల సంఖ్యలో కడప జగదీష్ న్యూరో కేర్ లో చికిత్సలు చేయించుకుంటున్నా పట్టించుకోని అధికారులు.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ ఘాటు విమర్శ.
న్యూస్ 21 తెలుగు: వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం. గోపవరం మండల పరిధిలో సెంచరీ పరిశ్రమ ఏర్పాటుతో తమ జీవితాలు బాగుపడతాయని ఆనందించిన ప్రజలకు నిరాశే మిగిలిందని, పరిశ్రమ నుంచి వస్తున్న కలుషిత నీరు తాగి జంతువులు చనిపోతున్నాయని, ప్రజలు కార్మికులకు చర్మవ్యాధులు, లంగ్స్, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సెంచరీ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు యస్. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణం భగత్ సింగ్ నగర్ లోని పార్టీ కార్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గోపురం మండల పరిధిలో సెంచరీ పరిశ్రమ ఏర్పాటుతో నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశించి తమ భూములను సైతం అప్పజెప్పిన స్థానిక ప్రజలకు నిరాశే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒకటిన్నర ఎకరా భూమి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన సెంచరీ పరిశ్రమ యాజమాన్యం నేడు బీహార్ లాంటి ప్రాంతాలను కార్మికులను తీసుకొచ్చి బానిసల్లాగా పని చేయించుకుంటూ స్థానికులకు మొండి చేయి చూపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైపెచ్చు గతంలో రాత్రి సమయాల్లో మాత్రమే పనిచేస్తున్న యంత్రాలను నేడు 24 గంటలు పని చేయించడంతో చుట్టుపక్కల కాలుష్యం పెరిగిపోయి చర్మవ్యాధులు, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో చుట్టుపక్కల ప్రజలు మరియు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు బాధపడుతున్నారని, పరిశ్రమ నుండి వస్తున్న కలుషిత నీరు తాగి జంతువులు, పశువులు మృత్యువాత పడుతున్నాయని దీనికంతటికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. కార్మికులతో పని గంటలు పెంచి భద్రతా పరికరాలు అందించకుండా ప్రజా సంఘాలు,కార్మిక సంఘాలు కనీస పరిశీలన చేయడానికి లోపలికి రాకుండా అడ్డుకుంటూ యాజమాన్యం నియంతృత్వంగా పనిచేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. గత కొన్ని నెలల కిందట నామమాత్రంగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఇప్పటికీ రిపోర్టులను అందించకపోవడం చూస్తుంటే కార్మికుల పట్ల యాజమాన్యానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతున్నదని ఆయన ఘాటుగా విమర్శించారు. ప్రతి నెల పదుల సంఖ్యలో పలు సమస్యలతో జగదీష్ న్యూరో కేర్ ఆసుపత్రులో కార్మికులు చికిత్స తీసుకుంటున్న మాట వాస్తవం కాదా? వీటన్నిటికీ పరిశ్రమ జీఎం రమేష్ కుమార్ రెడ్డి మరియు ప్రతినిధులు బాధ్యులు కాదా? సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్ని జరుగుతున్నా సంబంధిత కార్మిక శాఖ అధికారులు, పరిశ్రమల భద్రత అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ఈ విషయాలన్నిటి పైన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని విచారణ చేసి భూములను ఇచ్చిన కుటుంబాలకు మరియు స్థానిక నిరుద్యోగ యువతకు 75% ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అలాగే భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రజలకు, జంతువులకు హాని కలిగేలా కాలుష్యాన్ని వెదజల్లుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి మరొక్కసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలను,నిరుద్యోగ యువతను సమీకరించి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు కే.జకరయ్య, బి. అనిల్ నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, కే బాబు, విజయరావు,జయరామ రాజు గంట మహబూబ్ బాషా, చంద్రపాల్ మరియు పట్టణ నాయకులు సలీం తదితరులు పాల్గొన్నారు.
0 Comments