ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత వైసిపి పాలనలో నేడు కూటమి పాలనలో అప్పుల కుప్పగా తయారైందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి సభ్యులు పోరుమామిళ్ల మండల అధ్యక్షులు అన్వర్ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో కి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని గత వైసిపి పాలనలో మూడు లక్షల 30 వేల కోట్ల రూపాయలు ఉన్న అప్పు నేడు 5 లక్షల కోట్లకు పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసిపి పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని నానా యాగి చేసిన కూటమినేతలు నేడు అదే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం చూస్తుంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న చందంగా కూటమి పార్టీ వ్యవహార శైలి ఉందని ఆయన మండిపడ్డారు. తలసరి ఆదాయాన్ని పెంచాల్సిన ప్రభుత్వాలు తలసరి అప్పుని పెంచుకుంటూ పోవడం చూస్తుంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత పాలకులె కాకుండా నేటి పాలకులు కూడా అభివృద్ధిని మరచి సంక్షేమం కోసమే ఆరాటపడడం చూస్తుంటే రెండు పార్టీలు అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని, నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం రాజధాని ప్రాంతా అభివృద్ధిని చూసుకుంటుందని మిగతా ప్రాంతాల్ని విస్మరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆదాయం అంతా ఒకటే ప్రాంతంలో కేంద్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్న కూటమినేతలు నేడు కనీసం వైద్య కళాశాలలు కూడా ఏర్పాటు చేయలేక ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కోరడం దుర్మార్గమని, ఇకనైనా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిపై దృష్టి సారించి తలసరి ఆదాయాన్ని పెంచే మార్గాలను చూడాలని ఆయన హితవు పలికారు.
0 Comments